Wednesday 13 February 2013

ఇది మాకొక పెద్ద పండుగ రోజు  

ఒక రోజున ఎన్ని ప్రాశస్త్యాలో 

రేపు,   14 తేది గురువారం ఎంత ప్రాశస్త్యమైన దినమో!! ఎన్ని శుభ ఘడియలో, ఎన్ని నిశ్చితార్ధాలో, వివాహాలో.. ఎన్నిపెళ్ళి రోజులో.. ఎంత  పవిత్ర దినమో!!ఈ సంవత్సరం అదే రోజున మనకు అత్యంత ముఖ్యమైన రోజని కూడా తెలుసుకుందాం. మాఘ మాసం శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని అంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజించడం ప్రశస్తం. మరో ముఖ్యమైన రోజు కూడా..  అదే ప్రేమికుల రోజు !!   Valentine day అని విదేశీయులను అనుకరించి మనవారంతా శుభాకాంక్షలు అందజేసుకుంటారు. ఇదే రోజున నందిరాజు వారి ఇంట దశాబ్దాల కిందట (ఎంకి-నాయుడు బావ) పెళ్ళిరోజు కూడా. 

ఎఱ్ఱి నా యెంకి..
-----------------
"యెనక జల్మములోన 
యెవరమో"నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక...నా యెంకి 
"ముందు మనకే జల్మ
ముందోలె" యంటి!
తెల్లతెలబోయింది
పిల్ల... నా యెంకి! 
"యెన్నాళొ మనకోలె
యీ సుకము"లంటి
కంట నీరెట్టింది 
జంట... నాయెంకి!

ఈ నెల 7 వ తేదీ ఈ ఎంకిపాట మీ ముందుంచి ఆ ఎంకి ఎవరో త్వరలో చెబుతానని చెప్పా.. గుర్తుండక పొవచ్చు. ఎందుకంటే నా మాటలు గుర్తుంచుకో తగినంత గొప్పవి కాదు.  ఎందుకంటే నేనే అతి సామాన్యుణ్ణి కనుక.  ఇప్పుడు చెబుతాను..ఎంకి గురించి. 
       
భౌతికంగా శివుడు, పార్వతీమాత అర్దనారీశ్వరులు. కృష్ణుడు ఆధ్యాత్మికంగా అసలైన అర్ధ నారీశ్వరుడు. రాధాకృష్ణులు కూడా అవిభాజ్య పదం, జంట. రాధ అనే పదం ఉంటే కృష్ణుడు ఉన్నట్టే. కృష్ణునికి అష్టభార్యలు, 16 వేలమంది గోపికలు ఉన్నా రాధ మాత్రమే ప్రేమ సామ్రాజ్ఞి, పట్టమహిషి. 14 వతేదీ ప్రపంచం ప్రేమికుల దినోత్సవం  (వాలన్‌టైన్స్ డే) జరుపుకుంటున్నది. ఇది ఎప్పటినుంచి మొదలైందో తెలీదు కాని కృష్ణ ప్రేమతత్వం  ద్వాపరయుగం నాటిది. ప్రేమికులు శాశ్వతంగా  అలాగే మిగిలిపొతారో, ఐక్యమవుతారో తెలీదు. ప్రేమించి కలసిపోవడం ఒక అంశం. పెళ్ళాడి ప్రేమను అజరామరంగా సాగించడం అదృష్టం. 

పెనుమాక వారి ఇంట పుట్టి నందిరాజూ వారింట మెట్టి, నందిరాజు  ఎంకి గా మారిన రోజు . నండూరివారు వారు కూడా బంధువులే  కనుక కాపీరైటు నాకూ ఉంటుందనుకుంటా..  ఎంకి  (వెంకట శ్యామల)ని ఈ బావ (అంటే నేను) మనువాడాడు.   ఆమే నన్ను మనువాడిందని మా వాళ్ళు అంటారు. ఎందుకంటే నేను రాధ గా ఆమె శ్యామ్‌గా. కలిస్తే  రాధేశ్యామ్. ఆమే స్వతహాగానే విష్ణుభక్తురాలు. అంటే మేము రాధాకృష్ణులు, మేము ప్రేమ జంట కదా! మమ్ములను అటు ఇటు తిప్పినా మళ్లీ మేమే..కృష్ణ-శ్యామల. ఇక నాలోనే రాధాకృష్ణులు ఉన్నారు. అంటే మాది రాధాకృష్ణుల ప్రేమతత్వం. మా మనువు రోజుకు ఒక విశేషమొకటుంది.  శ్రీ పంచమి కూడా అయింది..    

నాకు ఇల్లే లేదు కనుక సామ్రాజ్యం అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం. కానీ నాజీవిత సామ్రాజ్యానికి ఆమే మహారాజు, మహారాణి.. సర్వస్వం. సుఖాలు ఎన్ని అనుభవించిందో తెలీదుకాని కష్టాలను మాత్రం పూర్తిగా జీర్ణం చేసుకున్నది. ఒక్కరోజు కూడా ఇదికావాలని అడగలేదు. ఎందుకంటే అది ఇవ్వలేని వాడినని తెలుసు గనుక. అది నా అదృష్టమో, తన  దురదృష్టమో తెలీదు.  ఆ ప్రేమికుల పండుగరోజు  మా పెళ్ళి రోజు. ఫిబ్రవరి 14... అ పెళ్ళికూడా దశాబ్దాల కిందట జరగడం కలియుగ వైకుంఠం (తిరుమల) లోనే జరగడం కాకతాళీయమో, మా అదృష్టమో!!.  బంధు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు ఎవ్వరు కలసి వచ్చినా, రాకున్నా .. మేము కడ వరకు కలసి సాగుతాం, కలసే పోతాం....మాది కూడా ఒక "మిధునం"..... జన్మ జన్మలకూ మాదే మధురమైన "మిధునం". 

నా ఎంకి గురించి, నా గురించి ఆత్మీయంగా తెలిసిన మరొక ఆప్త బంధువు
-------------------------------------------------------------------- 
*అచ్చంగా తెలుగు  ఆడపడుచు*.."చెల్లెలు పద్మిని"..
---------------------------------------------------
ఇది మా ఇంట అన్నింటికంటే మించిన  పెద్ద పండుగ, ఎంత సంతోషమో!! 

మా ఇంట "ఎంకి" గురించి నా చిన్న నాటి స్నేహితులకూ ఎరుకే! ఎందుకంటే మా మిత్రులం స్కూలు రోజుల్లో గుంటూరులోని మా మామ గారి ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. గత నెలలో మేము 50 సంవత్సరాల బాల్య మిత్రుల పండుగ చేసుకున్నప్పుడు పదిహేను మంది మిత్రులు మా ఇంటికి వచ్చి మా జంటను చూసి సంతోషించారు. వారి భార్యలు కూడ అందరూ ఒకే స్కూలులో చదివిన బాల్య స్నేహితులు కావడం మరొక గొప్ప విశేషం..  ఎన్ని మధురమైన "మిధునాలో"..


No comments:

Post a Comment