Wednesday 13 February 2013





                         జ్ఞానము జ్ఞాపకాల పుట్ట, ప్రేమ లేని జ్ఞానం నాశన  హేతువు: జిడ్డు కృష్ణమూర్తి.

                                                                  (ఇది నాలుగో భాగం.. )






జి కె అన్ని భవబంధాలను వదుల్చుకున్న తరువాత సంపూర్ణ  స్వేచ్ఛతో 70 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ప్రపంచాన్ని చుట్టి బహుజనానికి బోధ చేశారు. మొదటి నుంచి చివరి వరకు స్వేచ్ఛ , విద్య-జీవిత ప్రాధాన్యత, అసాధ్యమైన ప్రశ్న, కృష్ణమూర్తి నోట్ బుక్, కృష్ణమూర్తి జర్నల్, జీవన వ్యాఖ్యానాలు, హింస కావల, జీవన పరిపూర్నత, ప్రజ్ఞా మేలుకొలుపు తదితరాలైన రచనలు, ప్రవచన గ్రంధాలన్యు పాతికపైగా రాసి ప్రచురించారు.  ఆయన విప్లవాత్మక భావాలకు అనుగుణంగా ఇండియ, ఇంగ్లండ్, అమెరికా దేశాలలో ఏడెనిందికి పైగా కొత్త పాఠశాలలు ఏర్పడ్దాయి. కృష్ణమూర్తి ఫౌండషన్ వాటినిర్వహణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నది.
 
జికె ప్రబోధాలు కదళీఫలం కాదు, నారికేళమే.. ఒక పట్టాన జీర్ణం కావనే ప్రచారం ఉంది. సత్యానికి మార్గమంటూ లేదని, ఏ మార్గం ద్వారా కాని, ఏ మతం ద్వారాగాని, ఏశాఖ ద్వారా కాని, సత్యాన్ని పొందలేరని, సత్యం హద్దులకు నిబధ్ధతలకు లోనుకానిదని ఆయన చెప్పేవారు. అందువల్లనే సత్యాన్ని సంస్థాగతం చేయకూడదని, చేస్తే శవసదృశమవుతుందని ముఖం మీద కొట్టినట్లు వెల్లడించేవారు. ప్రజలను ఒక ప్రత్యేక సంస్థ, లేదా  సంఘాన్ని బట్టి పోవాలని ఒత్తిడి చేయడం తగదని స్పష్టం చేశారు.

దేవునిలో నమ్మకమే మతమనుకుంటామని,నమ్మకపోతే  నాస్తికుడని సమాజం, సంఘం తిట్టిపొస్తుందని, అలా కాకుండా నమ్మితే  ఒక సంఘం తిరస్కరిస్తుందని, నమంకపోతే మరొక సంఘం దండెత్తుతుందని అనేవారు. ఏ మత విశ్వాసమైనా మనుష్యులను వేరు చేస్తుందని పేర్కొంటూ విశ్వాసమ కేవలం వ్యక్తిగతమని కుండబద్దలు కొట్టినట్లు జికె చెప్పేవారు.

జ్ఞానం గురించి మాట్లాడుతూ, కేవలం తెలిసినదే జ్ఞానమని, దానిని మెదడు కణాలు సేకరిస్తాయని, అనతరం అది ఒక జ్ఞాపకంగా మిగులుతుందని తెలిపే వారు. జ్ఞాపకాల పుట్టను జ్ఞానమంటారని, అంతే గాక గతమే జ్ఞానమని జికె వివరించారు. సాంకేతిక జ్ఞానం ఒక మేరకు మాత్రమే, ఒక స్థాయిలో అవసరమని, అది భౌతిక జీవనానికి ఆధారమని వివరణ ఇచ్చారు.  మనిషిని జ్ఞానం మానసికంగా నిబధ్ధిస్తుందని, స్వేచ్ఛనివ్వదని, అది కొనసాగే ప్రక్రియ కనుక దానికి పరిపూర్ణత లేదని వాదం వినిపించే వారు.

అందువల్ల జ్ఞానం సృజనాత్మకమైన ఆంశం ఆదనికాదని,జ్ఞానంలో ఉబ్బి తబ్బిబ్బైన పండితులలో తామెక్కువంటే తామెక్కువన్న అహంకారం ఆవరించడం మొదలవుతుందని నిష్కర్షగా చెప్పి విషయ సేకరణ కంటే అవగాహన ముఖ్యమని ఆయన అనేవారు. "నిన్ను నీవు అర్ధం చేసుకోకుండా పెద్దల వత్తిడికి లోబడితే మనస్సును అణచివేయడం ప్రారంభమవుతుంది", అని హెచ్చరించేవారు. మనసు అణచివేతకు గురవుతే భయం ఆవరిస్తుందని, భయం ఉన్న చోట ప్రేమ ఉండదని, ప్రేమలేని జ్ఞానం మనలను నాశనం చేస్తుందని నిష్కర్షగాచెబుతూ, ప్రస్తుతం అదే జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారు.

ధ్యానం గురించి ప్రసంగిస్తూ, ధ్యానం అంటే మనసును డొల్ల చేయడమని, ఆ ప్రక్రియ ద్వారా నూతనత్వం పుట్టుకొస్తుందని, అన్ని ఆలోచనలనుండి, శబ్దాల నుండి మనసుకు స్వేచ్ఛనివ్వడమే నిజమైన ధ్యానమని నిర్వచించారు. ధ్యానంలో ఏకాగ్రత అనెది  స్వార్థపరంగా మొలకెత్తే అంశమని పేర్కొంటూ, అన్ని శక్తులను శ్రధ్ధగా, సావధానంగా సమీకరించడమేనని  ఉద్బోధించేవారు. సావధాన  సమీకరణే  ప్రేమ సుమం వికసించడానికి దోహద పడుతుందనేవారు.

"నేను-నాది" ఇవి వ్యక్తి భావాలని గుర్తించడం అవసరమని అవి ఒక విధంగా సార్థకాలు, అర్ధరహితాలని చెబుతూనే అవి వ్యవహారానికి అవసరమని అనేవారు. -నా చేయి, నా సరీరం, నా చిత్తం, నా ఆత్మ, నా దేవుడు.. అనడంతో నేను వేరు, నా చేయి వేరు అని విడదీస్తున్నామని అనిపిస్తుందనే వారు జికె. నేను- వేరు చేసి; ఇది శాస్వతం, సత్యం, సర్వాత్మ అంటూ వివరిస్తుంటామని, నా ఆత్మ- అన్నప్పుడు, నేను ఆత్మ వేరైనత్లేనా? నేనుకు-ఆత్మకు తేడా ఏమిటి? అని ప్రశ్నించేవారు. "అహం బ్రహ్మాస్మి-ఆయ మాత్మా బ్రహ్మ" అనే వాక్యాలను "నేను బ్రహ్మను,ఈ ఆత్మయే బ్రహ్మ -నేనే ఆత్మను, బ్రహ్మను" అని వాటి అభిప్రాయమని వివరణ ఇచ్చారు.అయితే నేను అన్నది వేరైనదా? లేక అనీ అదేనా? అనే సంశయం ఉత్పన్న మవుతుందనేవారు. దైవాన్ని, దైవశక్తిని ఆత్మ అని, పరమాత్మ అని, అంటే  పేర్కొంటుంటారని,  అంటే అతీత శక్తి "ఆత్మ" రూపమైందని అంటారని, బ్రహ్మ, పరబ్రహ్మ ఆత్మకు పర్యాయ పదాలని జికె తెలిపే వారు. "నేను" I  అని ME అని SELF అని EGO    అని ఇంగ్లీషులో వాడతారని చెప్పేవారు. "ఆత్మ" SOUL అని,SPIRIT అని వాడతారు అని కూడా వివరించేవారు.

(మిగతా భాగాలు త్వరలో..)

No comments:

Post a Comment