Friday 29 March 2013



దశాబ్ద కాలంలో ప్రచురితమైన నా వ్యాసాల సంఖ్య468 కి  చేరింది.


దశాబ్ద కాలంలో వార, పక్ష, మాసపత్రికలలు, ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రచురితమైన, ప్రసారమైన 

నా వ్యాసాల సంఖ్య దీనితో 468 కి  చేరింది....

"ప్రజాతంత్ర" రాజకీయ వారపత్రిక తాజా సంచిక(2013,మార్చ్ 4-10) లో ప్రచురితమైన రెండు వ్యాసాలు - "రాష్ట్రంలో మటుమాయమైన బిజెపి" ;"ఆకాశంలో సగం, అవనిలో సగం" నా 467, 468 వ వ్యాసాలు. కేవలం ప్రజాతంత్రలో ప్రచురితమైన వ్యాసాలను పరిగణలోకి తీసుకుంటే వీటితో కలిపి ఆ సంఖ్య 114 కు చేరుకున్నది.

1978 నుంచి 2013 వరకు ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ/ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎన్ఎస్ఎస్, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, వార్త, ఆంధ్రప్రభ (ఆంధ్రప్రభలో మూడు విడతలుగా), తాజాగా బాధ్యతలు స్వీకరించిన "క్షత్రియప్రభ"[మాసపత్రిక] పది సంస్థల్లో 35 సంవత్సరాల ఈ పాత్రికేయ వృత్తి కాలాన్ని, కలాన్ని రెండు భాగాలుగా విభజించి... పునఃసమీక్షించుకుని, ఆత్మావలోకనం చేసుకుంటే వృత్తి జీవితంలో ఎత్తులకు ఎదగలేకపోయినా కాలానికి ఎదురీది, కలాన్ని బలంగా ఝళిపించగలిగానన్న సంతృప్తి మాత్రం మిగిలిగింది. ఎదురుదెబ్బలు తగిలినా వృత్తి మారలేదు.. ప్రవృత్తీ మారలేదు.

మొదటి 22 సంవత్సరాలు గంగాప్రవాహమే. ఆ తరువాత వేగానికి కళ్లెం పడిందికాని దేనికీ రాజీపడలేదు, రాజీనామాలకూ వెరవలేదు. 1978 నుంచి 2000 వరకు ప్రయాణం ఒక విధం.. ఆ తరువాత మరో విధం. 2000 నుంచి 2013 వరకు అంతా ఎగుడు దిగుడుల ప్రయాణమైనప్పటికీ, అడుగు ఆగకుండా నిరాఘాటంగా, నిరాటంకంగా సాగుతునే ఉంది. 22 సంవత్సరాల అనుభవపాఠాలు గత 13 సంవత్సరాలుగా ఆలోచనల ఆరోహణకే ఉపకరించాయి కాని మెట్టు దిగజార్చలేదు. వివిధ దినపత్రికలు, వార్తాసంస్థల్లో పని చేస్తునే వృత్తిరంగంలో మరింత విస్తరించగలిగే సువర్ణావకాశాలు అందివచ్చాయి.

2003 నుంచి ఈ ఏడాది మార్చ్ ఆఖరు వరకు వేర్వేరు దినపత్రికల్లో రోజువారీ వార్తా లేఖనంతోపాటు వివిధ వార, పక్ష, మాస పత్రికలు సహా ఆకాశవాణి, దూరదర్శన్.. ఇతర తెలుగు చానళ్లకు వార్తలు, వ్యాఖ్యలు, వ్యాసాలు.. పుష్కలంగా అందించ గలిగానన్న కించిత్తు గర్వం మిగిలింది. గత దశాబ్ద కాలాన్ని పునరావలోకనం చేసుకుంటే, దిన పత్రికలు కాకుండా "వెలుగుబాట", "ఫోకస్", "ప్రజాతంత్ర", "ఈవారం" వారపత్రికలు, మరికొన్ని పక్షపత్రికలు, "యోజన"(కేంద్రప్రభుత్వ) మాసపత్రికల్లో నాలుగు వందలకు పైగా వ్యాసాలు ప్రచురితం కావడం పాత్రికేయుడిగా నాకు ఒకింత గర్వం మిగిల్చింది.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రత్యేక వార్తావాహినులు, శాసనసభ సమావేశాల సమీక్షలు, వార్తావ్యాఖ్యలు సుమారు వంద ప్రసారమయ్యాయి. ఇవిగాక అంధ్రప్రభ, వార్త దినపత్రికలలో(2007-2011) వార్తా లేఖలు, ప్రత్యేకవ్యాసాలు మరో పాతికపైగా ముద్రితమయ్యాయి. అచ్చురూపంలో పదేళ్ళుగా వచ్చిన 400 వరకు (clippings) వ్యాసాలను భద్రపరచుకో గలిగాను. 1978-2000 వరకు ప్రచురితమైన ప్రత్యేక వ్యాసాలు అసంఖ్యాఖంగా ఉన్నా వాటిని భద్రపరచుకునేందుకు సాధ్యపడలేదు.

"వెలుగుబాట" వార పత్రికలో(2003-05) 58, "ప్రజాతంత్రలో"(2003-2013) 114, యోజనలో(2002-2003) 9, "ఈవారం" వారపత్రికలో(2008- 2010) 162 [91సంపాదకీయాలు, 71 వ్యాసాలు], "ఫోకస్"లో 6, ఆంధ్రప్రభలో [పశ్చిమబెంగాల్ పర్యటన-2007] 5, వార్తలో (2009-11-హబుల్) 12 ప్రత్యేక వ్యాసాలు అచ్చయ్యాయి. వీటిలో 85 'ఈవారం' సంపాదకీయాలకు గత సంవత్సరం "అక్షరధార" పేరిట ఒక పుస్తక రూపం ఇవ్వగలిగిన భాగ్యం కలిగింది. ఈ సంకలన పుస్తకానికి అష్టదిగ్గజాల్లాంటి ఎనిమిదిమంది "ఎడిటర్లు" మంచి మాటల దీవెనలు అందజేయడం నిజంగా నాకు లభించిన పెద్ద పురస్కారమే ! ! ఈ రంగంలో ఎందరో దిగ్దంతలు, నిష్ణాతులు, కాకలు తీరిన కలం యోధులు ఉన్నారు. వారితో ఏపాటి పోలికా లేదు. వారి సరసన పేరు చెప్పుకునే అర్హతా లేదు. కొందరు మహనీయుల వద్ద పనిచేసే అదృష్టం మాత్రం లభించింది. భగవదనుగ్రహం, గురు కృప, పెద్దల ఆశీస్సులు, మిత్రుల ప్రోద్బలం, ఆప్తుల ప్రోత్సాహంతోఈ కలం కొన (వరకూ) సాగుతునే ఉండాలాన్నదే నా ఏకైక ఆకాంక్ష..

No comments:

Post a Comment