Wednesday 17 April 2013

                    తెలుగుకు అఖండ గౌరవం తేజోత్రయం... 

కవిత్రయం మనం చేసుకున్న పుణ్యం. తెలుగునేలకు పరిమళాలు మరోసారి వీచినవేళ నేడు. అదేమాదిరి ముగ్గురు జ్ఞానమూర్తుల ప్రభలు వెలిగిన నేల. నాడు భారతాన్ని తెనిగీకరించిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ. నేడు జ్ఞాన పీఠ పురస్కారాన్ని అందుకున్న తెలుగు తేజోమూర్తులు.. విశ్వనాథ, సినారే, రావూరి..

జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురితో పరిచయం నిజంగా ఏజన్మలో పుణ్యఫలమో..ఈ ముగ్గురినీ కలిసే, పలకరించే, వారి పలుకులు రాసే భాగ్యం ప్రసాదించింది పాత్రికేయ వృత్తే. 

విజయవాడలో ఈనాడు ప్రతినిధిగా ఉన్నప్పుడు విశ్వనాథవారి అనేక సాహితీ కార్యక్రమాలకు హాజరై వార్తారూపం ఇచ్చే అవకాశం కలగడం నిజంగా అదృష్టమే. అలాగే సినారే నారాయణరెడ్డి గారితో పరిచయం మూడు దశాబ్దాలుగా ఇప్పటికీ సాగుతుండడం సత్కర్మ ఫలమే.. 

ఇక రావూరి గారు. ఆయనతో రెండు రకాల సంబంధ బాంధవ్యాలు. కవి-విలేకరి గా ఒకటి. ఇండియన్ఎక్స్‌ప్రెస్ సహచర పాత్రికేయ చాయాచిత్ర గ్రాహకుడు రావూరి కోటేశ్వరరవు తండ్రిగా ఆ పెద్దాయనతో మరో అనుబంధం.. అతి చనువుగా భుజాన చేయివేసి అప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి..ఆయనకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం తెలుగు వారికి, తెలుగు భాషకు అమందానంద భరితం. ఆయనను అభినందించే స్థాయి లేదు. ఆ కవిమూర్తికి సహస్రవందనాలు.. రావూరి రచన "పాకుడురాళ్ళు" చదవని వారు ఉంటారేమోకాని విననివాళ్ళులేరని ప్రగాఢ విశ్వాసం..




ఈరోజు మనరాష్ట్రానికి మిశ్రమ ఫలాలలు. ప్రమాదం, ప్రమోదం, విషాదం, విచారం..పసలేని రాజకీయం..

తెలుగువెలుగు రావూరి భరద్వాజ గారికి ప్రతిష్ఠాకరమైన అత్యున్నత జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం గర్వకారణం. ఆనందం. 

బెంగళూరులో రెండు ప్రేలుళ్ళ సంఘటనలు. క్షతగాత్రులలో తెలుగు వారు ఉండడం విచారం. 

భారత ఎన్నికల ప్రధానాధికారిగా, లా కమిషన్ సభ్యురాలిగా, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పలు బాధ్యతలు నిర్వర్తించిన విదుషీమణి తెలుగింటి ఆడపడుచు రమాదేవి కన్నుమూయడం అత్యంత బాధాకరం.

డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై అధిష్ఠానంతో భేటీ కావడం ఉత్కంఠభరితం.

జగన్ అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ విచారణ పూర్తిచేసి తీర్పు రిజర్వు చేయడం నరాలు తెంచే థ్రిల్లింగ్ సస్పెన్స్

1 comment:

  1. ముందుగా మీకు నా దన్యవాదములు.. ఇంథ మహాకవులను మా బ్లాగ్ ల వారికి గుర్తుచెసినందుకు.. మీ నుండి ఇంకా మంచి రచనలు జాలువారలని నా మది కోరిక!

    ReplyDelete