Monday 10 June 2013

                  భారతీయ జన సంఘ్ నుంచి 
              భారతీయ జనతా పార్టీ నేటి వరకు  
                   62 సంవత్సరాల ప్రస్థానం..    


జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ

  జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భాజపా భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

శ్యాంప్రసాద్ ముఖర్జీ :

1901, జూన్ 6న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మద్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడిగా మే 23, 1953న మరణించేవరకు కొనసాగినాడు.

అటల్ బిహారీ వాజపేయి

1924లో గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 1968 నుండి 1973 వరకు జనసంఘ్ అద్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అద్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భాజపా ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.

లాల్ కృష్ణ అద్వానీ

1927లో కరాచిలో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. మహాత్మా గాంధీ హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భాజపాలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ  ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అద్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.

జనసంఘ్ అధ్యక్ష మహోదయులు.. 

శ్యాం ప్రసాద్ ముఖర్జీ, పండిట్ మౌళిచంద్ర శర్మ, పండిట్ ప్రేనాథ్ డోగ్రా, పీతాంబరదాస్, ఎ రామారావు, అచార్య డిఫి ఘోష్, బచ్‌రాజ్ వ్యాస్, బలరాజ్ మథోక్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్‌బిహారి వాజ్‌పేయీ, ఎల్‌కె అద్వాని.  

1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు మరియు ధృడమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్నది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ యొక్క వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే. 
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడినది. అటల్ బిహారీ వాజపేతి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలొ కేవలం రెండింటిని గెలుపొందింది. లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఫలితంగా 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని జనతాదళ్‌కు మద్దతునిచ్చి వీ.పీ.సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతొ రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసిన సందర్భాన అక్టోబరు 23, 1990న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగా తదుపరి నెలలో జనతాదళ్ ప్రభుత్యం పడిపోయింది.
1991 లోక్‌సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షం గా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వం గా పాలన కొసాగించింది. 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షం గా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారో వాజ్‌పేయి ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్పలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.

మొదటి భాజపా ప్రభుత్వం
1998 లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి గా కొనసాగినారు. కాని 1999 మే మాసములో ఆల్ ఇండియా అన్నా డి.యం.కే అధినేత్రి జయలలిత భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది.

రెండో సారి పూర్తికాలం అధికారంలో.
విజయాలు, వెలుగులు 

1999 అక్టోబర్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాన మంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది. భాజపా ప్రభుత్వం ప్రసార భారతి బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్ననేషనల్ ఫ్రంట్ హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది. 1998 లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సంపాదించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే.
భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) 2002 లో టెర్రరిస్ట్ నిరోధక చట్టాన్ని కూడా జారీచేసింది. ఈ చట్టం వల్ల ఇంటలిజెన్స్ కు మరింత అధికారం కల్పించినట్లయింది. 2001 డిసెంబర్ 13 న పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి కూడా ఈ చట్టం చేయడానికి దోహదపడింది. ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే వాజ్‌పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వ కార్పోరేషన్లను ప్రైవేటీకరించం, ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల ప్రకారము సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల, ప్రత్యేక ఆర్థిక మండలుల (Special Economic Zones) ఏర్పాటు మొదలగు ఆర్థికపరమైన మార్పులు చేశారు. ప్రభుత్వం ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా తగిన శ్రద్ధ తీసుకుంది. మద్య తరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించబడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దానితో బాటు విదేశీ వ్యాపారం కూడా వృద్ధి చెందింది. 2004 లో ప్రభుత్వం సాప్టా (దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, South Asia Free Trade Agreement) పై పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దక్షిణాసియా లోని 160 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
అప్పటి ప్రధాని హోదాలొ వున్న వాజపేయి పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకై స్వయంగా ఒంటిచేత్తో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. 1999 లో ఢిల్లీ - లాహోర్ బస్సును ప్రారంభం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. 2001 లో కార్గిల్ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ అధినేతపర్వేజ్ ముషారఫ్ ను భారత్ పిలిపించి చర్చలు జరిపినారు, కాని ఆ చర్చలు విఫలమయ్యాయి. టెర్రరిస్టుల దాడి తర్వాత రెండున్నర సంవత్సరాలు భారత్-పాక్ సంబంధాలు క్షీణించిపోయాయి. అటువంటి ఆ సమయంలో ఆగస్టు 2004 వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ "పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకైనా జీవితంలోనే చివరి గొప్ప ప్రయత్నం చేస్తా"నని ప్రకటించి ప్రపంచ దేశాఅధినేతలను ఆకట్టుకున్నారు.

తప్పిదాలు, తలనొప్పులు...

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అల్లర్ల సమయంలో హిందువుల గుంపులను ఆపలేడని, ముస్లింలను రక్షించుటలో పోలీసులను ఉపయోగించలేడనే విమర్శలున్నాయి. సుమారు 1000 మంది ఈ సంఘటనలో మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయిననూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నిని తప్పుపట్టడాన్ని ప్రయత్నించగా పార్టీలోని అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితితో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. కాని ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి.

భాజాపా మరియు దాని కూటమి 2004 భారత సార్వత్రిక ఎన్నికలు లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఎర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పొయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్‌ మరియు దాని ఐక్య ప్రగతిశీల కూటమికి చెందిన డా. మన్మోహన్‌ సింగ్‌ కోల్పోవాల్సి వచ్చింది.
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, భాజపా కు చెందిన సుష్మా స్వరాజ్ మరియు ఎల్‌.కె. అద్వానీ వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని మరియు ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలొ ప్రావీణ్యం లేకపోవటం, "ఇందిరా గాంధీ కోడలు అయిన నాడే తాను హృదయంలొ భారతీయురాలైనానని" చెబుతూ రాజీవ్ గాంధీ ని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15సంవత్సరాలు(దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపొవటం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా సోనియా గాంధి ప్రధానమంత్రి కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.
ప్రజలలో వాజపేయి కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి మరియు పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలన భాజపా గెలుస్తుందనుకొన్న ఓటర్లకు మరియు రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, భాజపా ప్రచారం కేవలం దూరదర్శిని మరియు ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. మరియు భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ సంస్థలు రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి మొదలగు భాజపా సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్ధిక అభివృద్ది ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విష్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
జాతీయ ప్రజాతంత్ర కూటమి అంతర్గత సమస్యలు మరియు భాజపా యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య లాల్‌ క్రిష్ణ అద్వానీ ని పార్టీ అధినేతగా నిర్ణయించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్.డి.ఎకి సారద్యం వహించవలసిందిగా కోరింది. వాజ్‌పేయిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నా, అది నామమాత్ర లేదా గౌరవార్థస్థానమే, కానీ భవిష్యత్తులో ఆయన ప్రాబల్యం తగ్గుతుందనటానికి ఒక సూచన కూడా. పైగా వాజ్‌పేయి తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీచేయబోనని ప్రకటించాడు.
జూన్ 2005లో పాకిస్థాన్ సందర్శన సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకొవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శల నెదుర్కున్నారు, పలు పార్టి శ్రేణులు రాజీనామా కోరడంతో కొన్ని వారాలు సంయమనం కోల్పోయారు. చివరకు రాజీనామా చేసి, ఉపసంహరించుకొని, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. డిసెంబర్ 31, 2005న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత రాజ్‌నాథ్ సింగ్ భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు. మళ్ళీ నితిన్‌గడ్కరి అధ్యక్షపీఠం అలంకరిచారు. పదవీకాలం పూర్తయి మరోసారి రాజనాథ్‌సింగ్ కు కిరీటం లభించింది. అద్వాని రాజీనామాతో ఆయన శకం ముగిసింది..  

బిజెపి అధ్యక్ష పరంపర:  అటల్ బిహారీ వాజ్‌పేయి- 1980-1986; లాల్ కృష్ణ అద్వానీ - 1986-1991, మురళీ మనోహర్ జోషి - 1991-1993, లాల్ కృష్ణ అద్వానీ - 1993-1998, కుషభావ్ థాక్రే - 1998-2000, బంగారు లక్ష్మణ్ - 2000-2001, జానా కృష్ణమూర్తి - 2001-2002, వెంకయ్య నాయుడు - 2002-2004, లాల్ కృష్ణ అద్వానీ - 2004-2005, రాజ్ నాథ్ సింగ్ - జనవరి 2005 -డిసెంబరు 2009, నితిన్ గడ్కరి - డిసెంబరు 19, 2009 నుండి..నితిన్ గడ్కరి రెండు పర్యాయాలు, రాజనాథ్ సింగ్ రెండు పర్యాయాలు అధ్యక్ష పీఠం అధిరోహించారు.  











No comments:

Post a Comment