Thursday 6 June 2013

                  సంక్షిప్తగా మహాభారతం... 

  
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటప్పుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగం చేస్తున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:
ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.
"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది.

ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు. వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.

No comments:

Post a Comment