Tuesday 27 August 2013


                      శ్రీకృష్ణాష్టమి నేడే.

 
కృష్ణం వందే జగద్గురుం.. 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || గీ.4-7 

ఓ అర్జునా ! ధర్మమునకు హానీ కలిగినపుడు, అధర్మము పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును అని, అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. . 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||

                                                     

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు . శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు కంసుని చెరసాలలో జన్మించాడు జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

ఈ భారతావనిలో శ్రీకృష్ణాష్టమి అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు శ్రీకృష్ణాష్టమి అవతరించిన "శ్రీకృష్ణావతార జన్మదినం" పవిత్రమైన పుణ్యదినంగా జరుపుకుంటాం. శ్రావణ మాసపు అష్టమినాడు జన్మించిన శ్రీకృష్ణుడు ఆబాలగోపాలానికి అత్యంత ఆరాధనీయుడు. భగవద్గీతతో మానవాళికి ధర్మాన్ని బోధించిన గీతాకారుడు హిందువులకు పరమపూజ్యనీయుడు. జగద్గురువు జన్మించిన కృష్ణాష్టమి దినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా అవలంభిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దక్షిణ భారతదేశంలోని మహిళలు తమ గృహాలను అందంగా అలంకరిస్తారు. రకరకాల తీపి పదార్ధాలు నల్లనయ్యకు నైవేద్యంగా అందించేందుకు సిద్దమవుతాయి. బాలకృష్ణునికి అత్యంతప్రీతిపాత్రమైన వెన్నను ఆ గోపకిషోరునికి ఆరగింపచేసి, ఆ దేవదేవుని కరుణాకటాక్షవీక్షణాలు పొందేందుకు ప్రతి గృహం ఎదురుచూస్తుంటుంది.

ఇంటి వాకిలి నుంచి పూజామందిరం వరకు ముద్రితమై చిన్నారి పాదముద్రలు ఆ బాలగోపాలుని రారమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి. పాదముద్రల కోసం నీరు, ధాన్యపు పిండి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. పసిపాపడి పాదాలకు అద్దిన పిండితో వేసిన పాదముద్రలను చూచిన కృష్ణభగవానుడు ఇంటిల్లిపాదిని చల్లగా కాపాడుతాడన్న భావన అందరికి ఆనందాన్ని చేకూరుస్తుంది. ముకుందుని భక్తులు పరమపవిత్రమైన భాగవతాన్ని పారాయణం చేయడంతోపాటుగా, సంగీత,నృత్య,గాన మరియు భజనలతో దేవకీనందుని రోజంతా స్మరించుకుంటారు. ఇక ఉత్తర భారతంలో శ్రీకృష్ణజన్మాష్టమి కోలాహలం మాటలకు అందనిది. బాలకృష్ణుని విగ్రహానికి అర్ధరాత్రి వేళ అభ్యంగస్నానం చేయించి ఊయలలో ఉంచుతారు. తమ పిల్లలకు పాలు, వెన్న పట్ల ఆసక్తిని పెంపొందించేందుకుగాను నవనీతచోరుని లీలలలో ఒకటైన వెన్నను దొంగలించే ఇతివృత్తాన్ని ఉట్టిని కొట్టే వేడుక రూపంలో వీధుల్లో ఆచరిస్తారు. పెరుగు, వెన్నలతో నిండిన మట్టికుండను ఆకాశంలో వేలాడదీసారా అన్న రీతిలో అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు.

కృష్ణ పరమాత్మ అంటే అపరితమైన ఆనందం. ఇంత అని కొలవడానికి అవకాశం లేనిది. దేన్నైతే పొందాక ఇక మరొకటి కావాలని అనిపించదో అదే అపరిమిత ఆనందం అంటే. శ్రీమద్భాగవతంలో "దేవకీ పూర్వ సంధ్యాయాం అవిర్భూతం మహాత్మనం" అని చెబుతారు. పరమాత్మ దేవకీదేవికి పుట్టాడు అని చెబుతారు. ఆయన అవతరించాడు అని చెప్పరు, అవతరించాడు అంటే ఆయన ఎక్కడి నుండో దిగి రావడం. నేను పుడతాను అని మాట ఇచ్చాడు దేవకీదేవికి. ఆయన తన మాటకే కాదు తన భక్తుల మాటని కూడా తప్పు కానివ్వడు. నృసింహ అవతారం వచ్చింది ప్రహ్లాదుని మాటని నిజం చేయడానికే కదా. అట్లా పుట్టాడు స్వామి. ఆయన పుట్టగానే ఎట్లా ఉన్నాడు అని సేవించిన వసుదేవుని మాట, ఆయన అవతారాన్ని వర్ణించిన వ్యాసుని మాట "తమద్భుతం బాలకం". 

ఇతను పరమాత్మే అని గుర్తించడానికి పుండరీకాక్షుడై, నాలుడు భుజములు కలిగి, శంఖచక్రగద ధారియై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలిగి, కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. అట్లాంటి స్వామిని వసుదేవుడు చూసాడు. కారాగారంలో అర్దరాత్రి దేవకీ వసుదేవులకు పుట్టాడు. కంసునికి తెలిస్తే ఏం చేస్తాడో అని దేవకీదేవి చేసిన ప్రార్థనకి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరం శ్రీకృష్ణ అవతారం. అనంత కోటి బ్రహ్మాండములని తన పొట్టలో దాచుకున్న స్వామిని మనం కట్టి వేయగలామా! కానీ ఆయన యశోదమ్మ ప్రేమకు కట్టించుకొని తన సౌశీల్యాన్ని చూపించాడు. అట్లాంటి స్వామిని మనం సేవించుకోగలిగే అవకాశం స్వామి మనకు ప్రసాదించడమే మన అదృష్టం.

No comments:

Post a Comment